చికిత్స

ముందు ఎప్పుడూ లేనంత
తొమ్మిది డిగ్రీలకు చేరిన
వాతావరణం హెచ్చరిక
ఒకపక్క చలి ఈదురుగాలి
దీనికి తోడు
102 డిగ్రీల జ్వరం
రాత్రంతా ఇంకిపోయిన సెలవేళ్లు
డైనమైట్లతో పేల్చేసిన పర్వతాలు
జెసిబి లతో ఇసుకను తరలిస్తున్న క్వారీలు
జలధారకు బదులు
సర్కారు ముండ్ల చెట్లతో నిండిన చెరువు
ఆ సంవత్సరం కాలమంతా
మా ఊర్లో చనిపోయిన వారి పేర్ల స్మరణలు
రాత్రంతా కలవరించినట్టు
మా ఆవిడ
భయాందోళనలతో చెప్పింది
తెల్లారి కుర్చీలో కూర్చొని
ఆమె ఇచ్చిన అల్లం చాయ్ తాగుతూ
తెల్ల కాగితంపై చీకట్లో కలవరింతలను
వెలుగులో కవితగా కూర్చాను
ఆస్పత్రికి పోలేదు
ఏ మందు గోళీ వాడలేను
ఒక్కసారి ఒళ్లంతా
చల్ల చెమటలు పెట్టి
కనిష్ట స్థాయికి జ్వరం చేరింది
(మా పెద్దింటి అశోక్ కు…)
--- జూకంటి జగన్నాథం
