పూసపాటి విజయరామ గజపతి రాజు.
(సంఘసేవాతత్పరుడు )
రచయిత్రి గాయత్రి కలం నుండి జాలు తెలుగు సాంఘీక రూపకం

టీచర్ : పిల్లలూ! మీకు ఈ రోజు మన రాష్ట్రానికే చెందిన ఒక గొప్ప మహారాజుగారి గురించి చెప్తాను!. మీరు శ్రీ విజయరామ గజపతి రాజు గారి గురించి ఎప్పుడైనా విన్నారా?
పిల్లలు : లేదు టీచర్!
టీచర్ : మహారాజుల వంశంలో పుట్టినా కూడా తన ఆస్తిపాస్తులను ప్రజలకోసమే వినియోగించిన గొప్ప ఔదార్యం కల మహారాజు. ఆయనను పివిజి రాజుగారు అంటూ ప్రజలంతా ముద్దుగా పిల్చుకుంటూ ఆయనను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు.
అటువంటి శ్రీ పివిజి రాజు గారు విజయనగర మహారాజు అయిన పూసపాటి అలక్ నారాయణ గజపతి రాజు, మహారాణి విద్యావతి దంపతులకు 1924 మే 1 వ తారీఖున విజయనగరలోని కోటలో జన్మించారు. విశాఖ పట్నంలోని సెయింట్ ఎల్లాయిసెస్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. ఆ తర్వాత బెంగుళూరులో లాజిక్ అండ్ హిస్టరీలో ఎమ్. ఎ. చేసి, అమెరికా లోని కొలంబియాలో ఫిజిక్స్ లో పి. జి. చేశారు. అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఐన్ స్టీన్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయనకు గురువుగారయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (మాజీ రాష్ట్రపతి) గారి శిక్షణలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నారు.
తరువాత స్వామి జ్ఞానానంద గారితో అనుబంధం పెరగింది.
పిల్లలు : స్వామి జ్ఞానానంద గారి గురించి మీరు మాకు చెప్పారు టీచర్!
టీచర్ : అవును. వినండి!ఎంతో సామాన్యుడిలా అమెరికాలో చదువుకుంటున్న పివిజి రాజు గారు అక్కడే పరిశోధన చేస్తున్న మహారాష్ట్రకు చెందిన కుసుమ మడ్గావకర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1949 లో ఇద్దరూ స్వదేశానికి వచ్చారు. పాళీ భాషలో పరిశోధన చేస్తున్న శ్రీమతి కుసుమ గారు ఎన్నో పత్రాలను విశ్వ విద్యాలయాలకు సమర్పించారు. 1955 లో గజపతి నగరం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. వారే ఆనందగజపతి రాజు, అశోక గజపతి రాజు మరియు సునీతా ప్రసాదు. తరువాత పివిజి మాధురీ దేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం.
భారత దేశానికి వచ్చిన పివిజి రాజు గారు ప్రజలకు మంచి విద్యనందించాలని తమ కోటను కాలేజీగా మార్చారు. తమకున్న ఆస్తిలో చాలా భాగాన్ని విద్యాసంస్థలకోసం దానం చేశారు. అలాగే విద్యార్థులకు ఉచిత భోజనం కోసం తమ కున్న 370 ఎకరాలను సింహాచలం దేవస్థానానికి వ్రాసారు. నేటికీ ఉచిత అన్నదాన పథకం దేవాలయంలో విజయవంతంగా జరగటం విశేషం!
పిల్లలు: ఇటువంటి మహారాజు గురించి ఎక్కడా వినలేదు టీచర్!
టీచర్ :: అవును!. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ భవనాలు పివిజి గారివి. ఇంకా కోరుకొండ సైనిక స్కూలు భవనం కూడా వారిదే!. అలా విజయనగరం నుండి మచిలీపట్నం దాకా ఎన్నో రాజావారి భవనాలు విద్యాలయాలుగా మారిపోయాయి
స్వామి జ్ఞానానందగారి స్ఫూర్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ను ప్రెవేశపెట్టారు.
తండ్రి అలక్ నారాయణ పేరిట పివిజి రాజావారు మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టు, సొసైటీని ఏర్పాటు చేశారు పీవీజీ. తనకు వంశపారంపర్యంగా వచ్చిన 15వేల ఎకరాల ఆస్తులను ఈ ట్రస్టుకు రాసేశారు. ఆ వెంటనే 300 ఏళ్లుగా తమ కుటుంబం ఉంటున్న విజయనగరం కోటను ఖాళీ చేసి ట్రస్టుకు ఇచ్చేశారు. 1962లో అక్కడే మహారాజా మహిళా కళాశాల ఆరంభమైంది. మాన్సాస్ ట్రస్టు పరిధిలో 105 దేవాలయాలు, 14,800 ఎకరాల భూములు, 13 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో రూ.124 కోట్లు డిపాజిట్లు వేశారు. ఏడాదికి రూ.7 కోట్ల వరకు ట్రస్ట్ నుంచి సంస్థలకు అందుతాయి. ప్రస్తుతం విద్యాసంస్థల్లో 700 మంది సిబ్బంది, 10,500 మంది విద్యార్థులు ఉన్నారు.
పిల్లలు : మహారాజావారు రాజకీయాల్లోకి వచ్చారా టీచర్?
టీచర్ : వచ్చారు!. పివిజి రాజావారు 1952,1956 లలో ఉమ్మడి మద్రాసు – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. మరలా 1960,1971 లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యి ఎన్నో పదవులు చేపట్టారు. వీరు లోక్ సభకు విశాఖపట్నం నుండి, బొబ్బిలి నుండి మొత్తం నాలుగు సార్లు ఎన్నికయ్యారు. సోషలిస్టు డెమాక్రటిక్ పార్టీ ( ఇండియా )కు చైర్మన్ గా పనిచేశారు.
పిల్లలు : మహారాజా వారి జీవితం ఎంతో స్ఫూర్తివంతం టీచర్!
టీచర్ : అవును! పివిజి రాజావారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా రైతు సత్యాగ్రహం లోనూ, గుంటూరు జిల్లా రైతు యాత్ర లోనూ, ఉత్తర ప్రదేశ్, బీహార్ రైతు ఉద్యమాల్లో పోరాడి జైలు శిక్షను కూడా అనుభవించారు.
పిల్లలు : ఇటువంటి త్యాగమూర్తి మన రాష్ట్రంలో పుట్టటం మన అదృష్టం టీచర్!
టీచర్ : అవును!. వినండి!రాజావారు మంచి క్రీడాభిమానులు. స్వతహాగా క్రీడాకారుడు కూడా!
విల్లింగ్ టన్ స్పోర్ట్స్ క్లబ్- బొంబాయి.
క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా- బొంబాయి.
మద్రాస్ రేస్ క్లబ్- మద్రాసు.
కాస్మాపాలిటన్ క్లబ్ – మద్రాసు.
జింఖానా క్లబ్- ఢిల్లీ.
గోల్ఫ్ క్లబ్- ఢిల్లీ.
సికింద్రాబాద్ క్లబ్- సికింద్రాబాద్.
వంటి ప్రఖ్యాత స్పోర్ట్స్ క్లబ్బులలో సభ్యునిగా ఉన్నాడు. ఆంధ్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా చాలా కాలం పనిచేశారు.
ఇలా ప్రజలకు ఎంతో సేవచేసిన శ్రీ పివిజి రాజావారు దైవసేవలో తన శేష జీవితాన్ని గడిపారు. సింహాచలం గుడి అంటే పీవీజీకి ఎంతో ప్రీతి!. దేవాలయ సొమ్ముతో కాకుండా తన సొంత డబ్బు ఖర్చుచేసి కొండపైకి రోడ్డు వేయించారు. అంతేకాక సింహాచలం దేవాలయంలోకి దళితులకు దర్శనం కల్పించాలని ఆయనే నిర్ణయించారు. ఆ నిర్ణయం అప్పట్లో ఎంతో సంచలనాన్ని సృష్టించింది.చివరకు తన శేషజీవితాన్ని కూడా అప్పన్న వద్దే అంకితం చేశారు పీవీజీ. 60 ఏళ్ల తర్వాత ఆస్తులను అంతస్తులను,భవంతులను,అన్నీ వదిలి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. చివరకు ఆ గోశాలలోనే 1995 నవంబరు 14న కన్నుమూశారా మహారాజు.ఇంత ఉదారుడైన మహారాజు మన దేశానికే గర్వ కారణం!చెప్పండి పిల్లలూ! రాజావారికి జేజేలు.
పిల్లలు :శ్రీ పివిజి రాజవారికి జేజేలు. ( కరతాళ ధ్వనులు)
(సమాప్తం)
📖
టి. వి. యెల్. గాయత్రి.
పూణే, మహారాష్ట్ర.

