చిన్నకథలు – పెద్ద అర్థాలు
కథ : రాజకీయం
తంగెళ్ళశ్రీదేవిరెడ్డి ✍️


రాజాపురం పెద్ద నియోజకవర్గం. అక్కడ మనదేశం / జనంకోసం అనే రెండు రాజకీయపార్టీల హవా నడుస్తున్నది. మనదేశం పార్టీ నాయకుడు చంద్రన్న. అతడి ప్రధాన అనుచరుడు కొండన్న. జనంకోసం పార్టీ నాయకుడు రంగన్న. ఇతడి ప్రధాన అనుచరుడు సలహాదారుడు శీనన్న.ఇతడు వయసులో పెద్దవాడు. ప్రజలు వాళ్ళందరినీ అన్నా పిలుసుకోవడంతో వారి పేర్లు ఆ విధంగా స్థిర పడిపోయాయి.
కాలక్రమంలో రాజాపురం నియోజకవర్గం రెండు భాగాలుగా విడిపోయింది. నందాపురం పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడింది. “మనదేశం” పార్టీ నాయకుడు చంద్రన్న అక్కడి వాస్తవ్యుడే కాబట్టి అక్కడికే షిఫ్ట్ అయిపోయాడు.కానీ ఆ పార్టీని అభిమానించే జనాలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు,రాజాపురం పరిధిలో గ్రామస్థాయిలో బలంగానే ఉండిపోయారు.బలమైన నాయకుడు కొండన్న కూడా రాజాపురంలోనే ఉండిపోయాడు.
కొంత కాలం తర్వాత – రాజాపురంలో “మనదేశం” పార్టీ తుడిచి పెట్టుకుపోవడం మొదలయ్యింది. ఆ పార్టీకి చెందిన వాళ్ళు వివిధ పార్టీలో చేరిపోయారు. అట్లా “మనదేశం” పార్టీ క్రమంగా అక్కడ పూర్తిగా. కనుమరుగైపోయింది.”జనంకోసం” పార్టీకి ధీటుగా మూడో పార్టీ ” ప్రజాసైన్యం” ఊపందుకుంది.
అట్లాగే “జనంకోసం” పార్టీకి చెందిన రంగన్నకు పార్టీలో హవా తగ్గిపోయింది. పార్టీ బలం కూడా ప్రజల్లో పట్టు తప్పడం మొదలెట్టింది. ఈ పరిస్థితిలో
“మనదేశం” పార్టీకి చెందిన కొండన్న “జనంకోసం” పార్టీకి ఒక ఆశాకిరణంగా కనబడ్డాడు. ఒక మంచి రోజు చూసి పార్టీలో చేరిపోయాడు. కొండన్న వాగ్ధాటి… ప్రజాకర్షణ.. జనాలను కదిలించింది. పార్టీకి క్రమంగా పూర్వవైభవాన్ని తెచ్చిపెట్ట సాగింది. పార్టీకి చెందిన పూర్వ కార్యకర్త శీనన్న, కొండన్న నాయకత్వంలో బాగా యాక్టీవ్ అయ్యాడు. శక్తివంచన లేకుండా ఎప్పటిలా శ్రమించాడు.
అనుకున్నట్టుగానే “జనంకోసం” పార్టీ విజయం సాధించింది. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డ శీనన్న, ఇతర కార్యకర్తలు, కొండన్న ఆశీస్సులపై నమ్మకం పెట్టుకున్నారు.

ఒకరోజు –
గెలుపు తర్వాత నియోజకవర్గానికి వచ్చిన కొండన్నకు స్వాగతం పలికేందుకు బలం బలగంతో బయలు దేరాడు శీనన్న. కానీ అతడి కంటే ముందుగానే… అక్కడ “మనదేశం”కి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున పోగై ఉన్నారు. ఉన్నా కూడా అదంతా పూర్వ అభిమానం అని సరిపెట్టుకున్నాడు శీనన్న. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే మొదటి స్థానం ఉంటుందని కూడా ఆశించాడు.
కొండన్న కూడా శీనన్నకు మంచి మర్యాద ఇచ్చి
గౌరవించాడు. కార్యకర్తలకు మొదటి స్థానం ఉంటుందని సంకేతాలు అందించాడు.
**
క్రమంగా రాజకీయం మారిపోయింది.గ్రామాల్లో పదవులు ఉన్నా లేకున్నా
“మనదేశం “పార్టీ నాయకుల పెత్తనం మొదలయ్యింది. పోలీస్ స్టేషన్లలో, రెవెన్యూ ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో,
” జనంకోసం” పార్టీకి సంబంధించిన నాయకుల మాట కంటే కూడా “మనదేశం” పార్టీ నాయకుల మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి వచ్చింది.ఇదంతా చూస్తూ శీనన్న భరించలేక పోయాడు.
ఈ పరిస్థితుల్లో శీనన్న పాత కార్యకర్తలతో సమావేశమయ్యాడు..
“ఒకప్పుడు కొండన్న “మనదేశం” పార్టీలో ఉండవచ్చు. అంతమాత్రానికి పునాది రాయి నుండి “జనంకోసం” పార్టీని నిలబెట్టిన వాళ్ళను కాదని, “మనదేశం” పార్టీ వాళ్ళ పెత్తనం ఎట్లా సాగుతుంది ? “
” జనంకోసం- పార్టీ ఇప్పడు “మనదేశం” పార్టీగా కనిపిస్తున్నది. వెళ్ళి గ్రామస్థాయిలో పరిస్థితిని కొండన్నకు వివరించాలి “
” అంతేకాదు, పూర్వపరిచయాల్ని అడ్డం పెట్టుకొని కొన్ని పదవుల్ని కూడా అవతలి వాళ్ళు ఆశిస్తున్నారు. ఇందుకు చాన్స్ లేదు. ఆ పదవులన్నీ మనవాళ్ళకే రావాలి. పెండ్లాం పిల్లల్ని పక్కన పెట్టి కూడా పార్టీ కోసం కష్టపడ్డాం.. ఆస్తులు పోగొట్టుకున్నాం…అప్పుల పాలయ్యాం…కాబట్టి, ఆ కష్టానికి తగిన ఫలితం మనకు దక్కాలి.. “
అని బలంగా సమాలోచన జరిపి కొండన్నను కలిసేందుకు హైదరాబాద్ బయలుదేరాడు శీనన్న.వెంటే కొందరు కార్యకర్తలు ఉన్నారు.
అక్కడ –
” వెళ్లేసరికే వీళ్ళ కంటే ముందుగా పదవుల్ని ఆశిస్తున్న ఒకప్పటి “మనదేశం” పార్టీ వాళ్లే కొండన్నను కలిసి, చిరునవ్వుతో ఇంట్లోంచి బయటకు వస్తూ కనిపించారు.
**
నెల తర్వాత
చిరునవ్వుతో బయటకు వచ్చిన “మనదేశం “పార్టీ వాడు కీలకమైన పదవిని అలంకరించాడు. “జనంకోసం” పార్టీకై కష్టపడి నష్టపోయిన శీనన్న, అతడు బలపరిచిన ఇతర కార్యకర్తలు, అక్కడే పదవిని ఆశించి భంగపడిన గుండె బరువుతో నిలబడి ఉన్నారు.
ఇప్పుడు శీనన్న కళ్ళముందు వేయి తలల రాజకీయం అదృశ్యంగా వికటాట్టహాసం చేస్తూ… తన రాజకీయ అనుభవాన్ని పరిహాసం చేస్తూ… కనిపించింది…
