నూతన వత్సరం
ఒక సంవత్సరం
నిశ్శబ్దాన్ని చుట్టుకొని
వెనక్కి జారిపోతే—
మరొకటి
ఆశల పల్లకీపై
ముందుకు వస్తుంది
పోయిన క్షణానికీ
రాబోయే క్షణానికీ మధ్య
కనిపించని గీత—
“అంతా మారిపోతుంది” అన్న
నమ్మకపు మెరుపు
నవ్వులు, విందులు
ఒక రాత్రి మత్తుగా
రక్తంలో కరిగిపోతాయి
ఉదయం
అదే చూపులు
అదే నిజం
బిల్లులు తేదీని మర్చిపోవు
అనారోగ్యం దారి తప్పదు
ప్రకృతి
మనిషి అహంకారాన్ని
వైపరీత్యాలతో ప్రశ్నిస్తుంది
కేలెండర్ పేజీ తిరిగినంత మాత్రాన
జీవితం మారదు
మార్పు—
ఏ మాయలోనూ కాదు
మన సామర్థ్యంపై
మనమే వేసుకునే
నమ్మకపు సంతకంలో ఉంది
మనల్ని మనం మార్చుకోకుండా
ఏ మార్పూ పుట్టదు
ఏడాది మారాల్సిన పనిలేదు
తేదీ అనుమతి అవసరం లేదు
మార్పు మొదలయ్యేది—
ఇప్పుడే, ఇక్కడే
_ ఎల్ ఎన్ కొల్లి

