కాలాన్ని లిఖిస్తూ….!

గడచిన కాలాన్ని తెలుస్తూ
వర్తమానానికి వగస్తూ…
భవిష్యత్‌పై బెంగను పెంచుకుంటూ…
బతకలేక బ్రతుకుతూ…
జీవన పయనాన్ని సాగిస్తున్నాడు మానవుడు
జీవం లేని దేహాన్ని మోస్తున్నాడు!
ధన సంపాదనలో పడి…..
మానవ సంబందాలను మరచి…
సమయా సమయాలు పాటించక…
అక్రమ సంపాదనకై అర్రులు చాస్తూ…
అలుపెరగని పోరాటం కొన సాగిస్తున్నాడు
ఆఖరి దశలో మోసేందుకు ఆ నలుగురూ లేక అలమటిస్తున్నాడు!
ఈ ఉరుకుల పరుగుల జీవిత పయనంలో
నా అన్నవారిని దూరం చేసుకుంటూ…
దగ్గరున్న ధనంతో బంధాలు ముడిపడక
అనారోగ్యంతో అవస్థలు పడుతూ…
అవసాన దశలో ఒంటరి పోరాటం సాగిస్తునాడు!
ఏ పనికి ఎంత సమయం
కేటాయించాలో తెల్సుకుని…
పనికి తగ్గ సంపాదనను పెంచుకుంటూ…
బంధాలకు, అనుబంధాలకు
ముద్దు మురిపాలకు సమయాన్ని కేటాయిస్తూ…
ఆనందమయ జీవనానికి ప్రణాళిక రచించు కోవాలి!
జరిగేదంతా మంచికేనని
అనుకోవడమే మనిషి పని అనుకుంటూ…
గతాన్ని గుర్తుంచుకుంటూ….
వర్తమానాన్ని బేరిజు వేసుకుంటూ…
మానవత్వమే దైవత్వంగా తెలుస్తూ…
గడచిన కాలాన్ని పునాదిగా చేసుకుని…
ఉజ్వల భవిష్యత్ భవంతి నిర్మాణముకు శ్రీకారం చుట్టాలి!
వచ్చే నవ వర్షం….
జన జీవితాల్లో నవోదయం పూయించాలని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ…
నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం!!!.
— కమలశ్రీ
(ఆళ్ల నాగేశ్వరరావు)
తెనాలి, గుంటూరు జిల్లా
చరవాణి: 7416638823
