శ్రమజీవుల రెక్కల చప్పుడు
మట్టి చేతుల స్వప్నాలు,
వారి నుదిటిపై భవిష్యత్తు రేఖలు.
ఎండల్ని చీల్చుకుంటూ నడిచే అడుగులు
శ్రమైక జీవుల రెక్కలు వినిపించే చప్పుడు.
శ్రమజీవుల చెమట చుక్కల్లో
నిరంతరం మెరుస్తుంది ఆశ,
రాయి రప్పల కరిగించి అరిగించి పుడమికి మార్పును రుచి చూపిస్తుంది
భారాన్ని అలవోకగా దాటేసి
రేపటికి ఎగిరే ధైర్యమై నిలుస్తుంది
పగలు.. రేయి అరుగాలము
శ్రమజీవుల రెక్కల చప్పుడు,
పని పాటలకు పల్లవి పాడుతాయి
లోకానికి విజయసంకేతలను గుర్తు చేస్తాయి
ఆ రెక్కలప్పుడు ఖాళీగా ఉండవు
కలలను మోసే బలమైన రెక్కలవి
చెమటచుక్కలలో నిజాయితీని దాచుకుని
మెరుగైన భవితకు జీవం పోస్తాయి
ఎండా వానల్ని ఆ రెక్కలు లెక్క చేయవు
అవమానాల్ని సైతం అవకాశంగా మలిచు కుంటాయి
మరింత బిగదీసుకుంటాయి
అలసటను నేలకేసి కొడతాయి
రేపటి వెలుగుకి రెక్కలు చాస్తాయి
చెమట చుక్కల్ని తక్కువగా చూడకు
అవి పంచే పరిమళాలు దేశానికి పునాది.
శ్రమజీవుల రెక్కలు కదిలితేనే సమాజం ఎదుగుతుంది;
ఆ రెక్కల చప్పుడు నిరంతరం
మనందరికీ బాధ్యతను గుర్తుచేస్తుంది.
శ్రీదాస్యం లక్ష్మయ్య
9440155240

