ఓ స్నేహితా … 💞

అసలు నువ్వెవరు … ?
హా … అర్ధమయ్యింది
నువ్వు ఓ లత
నీకు అల్లుకోవడం తెలుసు
చుట్టుకోవడం తెలుసు
పట్టుకోవడం తెలుసు
ఎగబాకటం తెలుసు
మొగ్గ తొడగటం తెలుసు
పూలివ్వటం తెలుసు
పండ్లివ్వడం తెలుసు
ఏదిచ్చినా
ఏదీ ఆశించటం తెలియదు …
హా …
ఒకటైతే ఆశిస్తావు
నేను ఆనందంగా ఉండాలని
ఆరోగ్యంగా ఉండాలని
నా ఇంట ఐశ్వైర్యం నిండాలని
నా కడుపు పండాలని
వంశం వర్ధిల్లాలని
గోత్రం గో గురువులు నిత్యం
ఆశీస్సులు అందివ్వాలని …
అంతే కాదు …
నాకు జ్వరం వస్తే
నువు అన్నం తినలేదు
నా కాలు విరిగితే
ఆ చుట్టూ కలియతిరిగావ్
నా గుండెకు గండమొస్తే
ఎంత గుండెలు బాదుకొన్నావ్
నా కూతురు పెళ్ళికి
నువు పల్లకి మోసావ్
మా అమ్మ కాలం చేస్తే
కను చెమ్మతో కొమ్ముకాసావ్ …
అసలు …
నువ్వెవరివి ?
ఎందుకు ఇంత దరయ్యావు ?
నేనైతే నిన్ను “స్నేహితా… 💞”
అనే అంటాను
ఎందుకంటే నాది స్వార్ధం
నిద్రలో కూడా నమ్మకం
కలలోనే కాదు ఇలలోనూ
ఆనందం సంతోషం నువ్వు
నా అలసిన కనులకు
ప్రశాంతత నువ్వే
నిదరొస్తోంది ఇక బజ్జోనా
ఇది పెద్ద నిద్రయినా బాధ లేదు
ఎందుకంటే
నువ్వున్నావుగా స్నేహితా … 💞 😊
... ✍ "కృష్ణ" కలం
